SRH vs GT: హోం గ్రౌండ్లో హైదరాబాద్ ఘోర పరాజయం... అట్టడుగు స్థానానికి పడిపోయిన సన్‌రైజర్స్.! 7 d ago

IPL 2025లో భాగంగా 20వ మ్యాచ్‌లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్.. SRH ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కాటేరమ్మ కొడుకులు.. 300 స్కోర్ ఇలా ఓవర్ హైప్ ఇవ్వడంతో.. దానికి తగ్గట్లే పేలిన పర్ఫార్మెన్స్‌నే కనపరుస్తున్నారు. ఆడిన 5 మ్యాచ్‌లలో 4 మ్యాచ్‌లు ఓడిపోయి.. టేబుల్ చివరిలో నిలిచారు.
సిరాజ్ మియా తన బౌలింగ్ తో బ్యాటర్లను చిత్తు చేస్తున్నాడు. ఫ్రాంఛైజీ మారినప్పటి నుంచి మియా భాయ్ చెలరేగిపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా 4 వికెట్లు తీసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక ఈ దెబ్బతో పక్క 300 ఫిక్స్ అని అభిమానులు గోల గోల చేశారు. ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక సీన్ అంత రివర్స్ అయింది. మొదటి ఓవర్లోనే సిరాజ్.. ట్రావిస్ హెడ్ ను (8) పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మను (18) సైతం ట్రాప్ చేసి.. వికెట్ తీసాడు.
సిరాజ్‌తో పాటు ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వెయ్యడంతో SRH జట్టు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇషాన్ కిషన్ (17) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో టీం ఇంకా ఇబ్బంది పడింది. నితీష్ కుమార్ రెడ్డి (31), హెన్రిచ్ క్లాసెన్ (27) యాభై పరుగుల భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టారు.
ఆ తరువాత వచ్చిన కమిందు మెండిస్ (1), అనికేత్ వర్మ (18) ఎవరూ కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. కనీస స్కోర్ కూడా రాదు అనుకున్న సమయంలో SRH కెప్టెన్ పాట్ కమిన్స్ 9 బంతుల్లో 22 పరుగులు చెయ్యడంతో.. SRH నిర్ణిత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ కీలకమైన 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన GT ఓపెనర్లు మొదటి ఓవర్లలో తడపడ్డారు. పవర్ ప్లేలో మహమ్మద్ షమీ సాయి సుదర్శన్ ను (5) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తరువాతి ఓవర్లోనే కెప్టెన్ పాట్ కమిన్స్.. జోస్ బట్లర్ ను ఢకౌట్ చేసాడు. దాంతో 4 ఓవర్లకే 16 పరుగులు మాత్రమే చేసి గుజరాత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ దెబ్బతో SRH మళ్లీ తిరిగి పుంజుకుంది. కానీ SRH మాజీ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ వచ్చి ఆట మొత్తం మార్చేశాడు. SRH బౌలర్లకు చుక్కలు చూయించాడు. సిమర్జీత్ సింగ్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌తో సన్‌రైజర్స్ పతనం మొదలయింది. సుందర్ ప్రతీ ఓవర్లో బౌండరీ బాదుతూనే ఉన్నాడు.. 29 బంతులు ఆడి ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి బౌండరీ వద్ద దొరికిపోయాడు. కానీ ఈ క్యాచ్ మీద కూడా చాల విమర్శలు తలెత్తాయి.
సుందర్ ఔటయ్యే సమయానికే SRH ఓటమి ఖాయమైపోయింది. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ 43 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసి నిలకడగా ఆడాడు. రూథర్‌ఫోర్డ్ 16 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ 16.4 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.. అయితే సన్‌రైజర్స్ మాత్రం చివరి స్థానంలో నిలిచింది.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ (MI) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై హోం గ్రౌండ్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.